Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీవీ, ఫోన్, నెట్... పాక్ జైల్లో లగ్జరీగా ఉగ్రవాది లఖ్వీ!

జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ అంతర్జాతీయ ఉగ్రవాది. లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్. పాకిస్థాన్ జాతీయుడైన అతడు ఉగ్రవాదిగా మారి ముంబై మారణకాండకు పథకం పన్నాడు. 2008లో ముంబైలో జరిగిన మారణహోమంలో 166 మంది మరణానికి కారణమయ్యాడు. ఇవే అభియోగాలపై అతడిని పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. రావల్పిండి జైల్లో పెట్టింది. బెయిల్ మంజూరు, వెనువెంటనే రద్దు చేస్తూ ఆ దేశ కోర్టులు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా రావల్పిండి జైలు అధికారులు ఉగ్రవాదుల పట్ల చూపుతున్న ‘స్వామి’ భక్తి వెలుగు చూసింది. జైల్లో విచారణ ఖైదీగా ఉన్న లఖ్వీకి సకల సౌకర్యాలు అందుతున్నాయి. జైల్లో ఉంటూనే తాజా వార్తలు, వినోదాన్ని ఆస్వాదించేందుకు లఖ్వీకి జైలు అధికారులు ఓ టీవీని ఏర్పాటు చేశారు. అంతేకాక కుటుంబ సభ్యులు, తన ఉగ్రవాద కేడర్ తో నిత్యం సంప్రదింపులు జరిపేందుకు అతడికి ఓ మొబైల్ ఫోన్ ను కూడా అందించారు. ఇక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అతడికి అందుబాటులోకి తెస్తూ ఏకంగా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా కల్పించారట. ఇక లఖ్వీకి ములాఖత్ లకు సంబంధించి పరిమితే లేదు. ఎప్పుడైనా, ఎవరైనా, ఎంతమందైనా అతడిని కలవొచ్చట. నేరుగా జైల్లోకే వెళ్లి అతడితో మంతనాలు జరిపే వెసులుబాటును సదరు జైలు అధికారులు అతడి సన్నిహితులకు కల్పించారు.

More Telugu News